Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోమశుఁడు ధర్మరాజునకు ఋష్యశృంగుచరిత్రము సెప్పుట

వ.⁠

“ఋష్యశృంగుం డను ముని జన్మంబును దచ్చరితంబును వినవలయు నది యె” ట్లని
యడిగిన రోమశుం డి ట్లనియెఁ; “దొల్లి కశ్యపపుత్త్రుండగు విభాండకుం డనుముని
వరుం డఖండితబ్రహ్మచర్యంబునం దపంబు సేయుచు నొక్కనాఁ డొక్కమడు
వున నీళ్ళాడుచున్న యవసరంబున.

⁠ 87


క.⁠

సురుచిరసురూపగణసుం
దరి యూర్వశి యను లతాంగి తద్దర్శనగో
చర యగుడు, నపుడ రేత
స్స్ఖలనం బమ్మునికి నయ్యెఁ గామకృతమునన్.

⁠ 88


వ.⁠

అయ్యమోఘవీర్యంబుతో మిశ్రమం బయిన జలంబు నొక్కదుప్పిపెంటిమృ
గంబు ద్రావి గర్భంబు దాల్చిన నందు ఋష్యశృంగుం డనుకుమారుండు జన్మించి
తండ్రినిం దదాశ్రమంబునుం గాని యొం డెఱుంగక ఘోరతపంబు సేయుచున్నంత.

⁠ 89


తే.⁠

బలియుఁ డంగాధిపతి రోమపాదుఁ డనఁగ
ధరణిఁ బరగినవీరుండు దనపురోహి
తాపరాధకృతమున బ్రాహ్మణులచేత
విడువఁబడినఁ దన్మహి కనావృష్టి యయ్యె.

⁠ 90


వ.⁠

దానికి వెఱచి యాతండు బ్రాహ్మణులఁ బరమభక్తి నుపాసించి “యీయనావృ
ష్టిదోషం బేమి కారణంబున నయ్యె? దీనికిం దగిన ప్రతీకారం బెద్ది?” యని యడిగిన
వానికిం బ్రసన్నులై బ్రాహ్మణు లి ట్లనిరి.

⁠ 91


క.⁠

“కడుదర్పితుఁ డని నిన్నున్
విడిచిరి బ్రాహ్మణులు; వారు [1]విడుచుడు నమరుల్
విడిచిరి; దానన వర్షము
దడసె భవద్దేశమునకు ధరణీనాథా!

⁠ 92


ఉ.⁠

శాంతుఁడు ఋష్యశృంగుఁ డనుసన్ముని యున్నయెడన్ ధరిత్రికిన్
సంతతవర్షణం బగు; భృశం బగు నట్టివరంబు దొల్లి వృ
త్రాంతకుచే దయం బడసె నమ్ముని; గావున ఋశ్యశృంగు వే
[2]దాంతసువేది రాఁ బనుపు మంగమహీశ్వర! నీదు నేర్పునన్.”

⁠ 93


వ.⁠

అనిన విని రోమపాదుండు దనచేసినబ్రాహ్మణావమానంబునకుం దగినప్రాయ
శ్చిత్తంబుఁ జేసి, బ్రాహ్మణవచనంబున నపుడ బుద్ధిమంతులతో విచారించి, విద
గ్ధవేశ్యాంగనలం బిలువం బంచి, “మీనేర్చువిధంబుల ఋశ్యశృంగుం బ్రబోధించి
యిట తోడ్కొని రం” డని పంచిన.

⁠ 94


క.⁠

ఆవేశ్యాజను లధికర
సావహభక్ష్యములు, విలసదనులేపనమా
ల్యావళులుఁ గొనుచు నరిగిరి
[3]నావాశ్రమమునకు నమరనారులలీలన్.

⁠ 95


వ.⁠

అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దన పుత్త్రు ఋశ్య
శృంగు సమర్పించి, వన్యఫలాహరణార్థంబు వనంబున కరిగినయవసరంబున
నం దొక్కజరద్వేశ్య దనకూఁతు, నభినవయౌవనవిలాసవిభాసిని నమ్మునిపుత్త్రు
పాలికిం బుచ్చిన, దానిం జూచి ఋశ్యశృంగుండు సంభ్రమంబున.

⁠ 96
  1. ↑ విడిచిన ... దడరె భవ
  2. ↑ దాంతనివేది; దాంతిమవేది ... నేర్చు నేర్పునన్; నేర్పు రూపునన్
  3. ↑ పావన మగుమౌని నిజతపోవనమునకున్