Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

[1]అస్మత్పోషణోపాయచింత సేయవలదు; వన్యమూలఫలంబులు నేను తెచ్చికొని
యుపయోగించుచు జపహోమాదిపుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు
నుండెద; మధర్మవర్తి యయి మీ కపకారంబు సేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబున
నుండ నోప” మనిన వారల రాక కొడంబడి.

⁠ 17


తే.⁠

“ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్లప్రొద్దుఁ
దృప్తు లగుచున్న వసుమతీదేవవరులఁ
గానలందు శాకాశనుల్ గాఁగ నెట్లు
సూడనోపుదు” నని ధర్మసూనుఁ డపుడు.

⁠ 18

శౌనకుఁడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

వ.⁠

శోకమూర్ఛితుం డై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుం
డను బ్రహ్మఋషి దొల్లి యాత్మవ్యవస్థానార్థంబు జనకకృతంబులయిన శ్లోకంబుల
యర్థంబులు యుధిష్ఠిరున కి ట్లనియె.

⁠ 19


క.⁠

“శోకభయస్థానంబు ల
నేకంబులు గలిగినను [2]విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి
వేకము గలవాఁడు బుద్ధివికలుం డగునే?

⁠ 20


క.⁠

శారీరమానసమహా
దారుణదుఃఖములఁ జేసి [3]తఱిఁగి శరీరుల్
క్రూరతరబాధఁ బొందుదు;
రారెంటిని జెఱుతు రార్యు లమలినబుద్ధిన్.

⁠ 21


వ.⁠

వ్యాధి శ్రమానిష్టసంస్పర్శనేష్ట [4]వివర్జనంబులను నాల్గింటం బుట్టి శారీరదుః
ఖంబు లాశుక్రియాది ప్రతియోగంబుల నుపశమిల్లు; మఱి స్నేహజంబు లయిన
మానసదుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు విమలజ్ఞానంబునం జేసి
యుపశమంబునం బొందు.

⁠ 22


క.⁠

స్నేహార్ణవమగ్నుం డయి
దేహి మహాదుఃఖముల నధృతిఁ బొందును; దుః
ఖాహతుఁడు శోకతాపవి
మోహి [5]యగున్; స్నేహమూలములు రాగాదుల్.

⁠ 23


వ.⁠

కావున బంధుమిత్రధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది; పద్మపత్రంబు
[6]నీరం బొందనియ ట్లెఱుకగలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు;
స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, గామంబునం గ్రోధంబును,
గ్రోధంబునం దృష్ణయు వర్తిల్లు.

⁠ 24


క.⁠

అది సర్వదోషముల [7]కా
స్పద; మది దురిత క్రియానుబంధంబులకున్
మొదలు; నిరంతరదుఃఖ
ప్రద మని దలఁచి తృష్ణఁ బాతురు సుమతుల్.

⁠ 25


వ.⁠

మఱియుఁ [8]దృష్ణాతురుం డర్థలోభంబునఁ గోటరస్థం బయిన యనలంబులం
జేసి దగ్ధంబగు వృక్షంబును బోలె వినాశంబునం బొందు; నర్థాసక్తుం డైన

⁠
  1. ↑ అస్మత్పోషణోపాయంబునకు జింత సేయ వలవదు...మధర్మవర్తులయి....రాష్ట్రులరాష్ట్రంబు
  2. ↑ వివేకవిహీనుం...బుద్ధి విరహితుఁ డగునే; బుద్ధివిరతుం డగునే; బుద్ధి విగతుం డగునే
  3. ↑ తగిలి
  4. ↑ విలోలజ్ఞానంబు లనునాలుగింటం బుట్టి
  5. ↑ యగుటఁ జేసి స్నేహముల రాగాదుల్; యగుటఁ జేసి స్నేహమున మోహితుఁడై
  6. ↑ నీరిలోఁ బొరయనియ; నీరం బొరయనియ; నీరియం దుండియు బొందనియ
  7. ↑ కా, స్పద మయి...మది నెఱిఁగి
  8. ↑ దృష్ణాపరుండై యర్థ