Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

యంశుమంతుండు నిజపుత్త్రుఁడగు దిలీపు
నందు రాజ్యభారముఁ బూన్చి యఖిలలోక
పూజితుండు దపోవనంబునకుఁ జనియె.

⁠ 72


వ.⁠

దిలీపుండును దన పితామహులైన సాగరు లధోగతులు గాకుండ గంగావతర
ణంబునందు యత్నంబు సేసి యశక్తుం డై.

⁠ 73


చ.⁠

ప్రథితయశున్, సుతుం బడసె భారసహిష్ణు, మహారథున్, భగీ
రథుఁ డను చక్రవర్తి, నపరాజితతేజు, నిజాన్వవాయదు
ష్పథవినివర్తకున్, సకరపార్థివజైత్రు, మదోద్ధతాసుహృ
న్మథను, సురాపగానయసమర్థతపోగుణయుక్తు నుత్తమున్.

⁠ 74


వ.⁠

ఆ భగీరథు నపారభూభారధురంధరుం జేసి దిలీపుండు తపోవనంబున కరిగిన.

⁠ 75


తే.⁠

కపిలుకోపాగ్నిఁ జేసి సాగరులు [1]గ్రాఁగి
రనియు, గతిఁ గానకున్న వారనియు, నెఱిఁగి
వారలకు హిత మొనరింప వగచి, గంగఁ
దేరఁ గడఁగె వీరుండు భగీరథుండు.

⁠ 76


వ.⁠

ఇట్లు భగీరథుండు గంగావతరణంబునందుఁ గృతనిశ్చయుం డై యరిగి, బహువి
ధాకారధాతుమంతంబు లైన యుత్తుంగశృంగంబులను, జలభరవినమ్రప్రబలబ
లాహకవ్యూహసంఛాదితశ్యామాయమానంబు లైన తుహినస్థలంబులను, సిద్ధవి
ద్యాధరగంధర్వగీర్వాణమిథునసంసేవ్యమానంబు లైన నానారత్నకందరంబుల
ను, శుకపికపారావతశుక్లాపాంగసారంగశతపత్రపుత్త్రప్రియదాత్యూహవ్యూ
హశబ్దశబ్దాయమానంబు లైన తరువనరేఖలను, సింహశరభశార్దూలశుండాలగో
లాంగూలకోలాహలాన్వితంబు లైన గుహాగహ్వరంబులనుం జేసి రమణీయభయా
నకం బైన హిమవత్పర్వతంబున.

⁠ 77


చ.⁠

సతత[2]కృతోపవాసముల, శాకఫలోదకమూలపారణ
వ్రతముల, దేవపూజల, నపారజపంబులఁ జేసి నిష్ఠతో
నతులతపంబు సేసె నమరాపగ నుర్వికిఁ దెచ్చు వేడ్కతో
ధృతియుతుఁ డై దిలీపకులదీపుఁడు దివ్యసహస్రవర్షముల్.

⁠ 78


వ.⁠

ఆభగీరథతపంబునకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షం బై “నీ యిష్టంబు సెప్పు” మని
నం గృతాంజలియై యి ట్లనియె.

⁠ 79


సీ.⁠

“తపనతేజుం డైన కపిలుకోపంబున
                 గతజీవు లై పుణ్యగతులయందు
విహతు లై మత్పితామహు లున్నవారు; నీ
                 దగు పుణ్యజలముల సగరసుతులు
సిక్తు లై స్వర్గానుభుక్తిఁ బ్రాపింతురు
                 [3]గావున దేవి! యిద్దేవపథము
నందుండి వసుమతి కొందంగఁ జనుదేర
                 వలయు” నావుడు “మహీవలయమునకు

⁠


ఆ.⁠

నేను వచ్చునపుడు నానిరంతరజలౌ
ఘంబు దాల్ప నీలకంఠుఁ డోపుఁ

⁠
  1. ↑ గాలి ... వలసి గంగఁ, దేరఁ బూని కడంగె భగీరథుండు
  2. ↑ కృశోపవాసముల ... దిలీపకులదీప్తుఁడు; భగీరథుఁడు ధీరుఁడు
  3. ↑ గాన వేఁడెద దేవి ఘనపథంబు