Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

గణేశశారదాగురుభ్యో నమః

శ్రీమదాంధ్రమహాభారతము

ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము

⁠



[1]మందిర! బుధజనచిం
తామణి! కోదండపార్థ! ధర్మవిచారో
ద్దామ! నలనృగభగీరథ
రామచరిత్రాభిరామ! రాజనరేంద్రా!

⁠ 1

అగస్త్యుచరిత్రము

వ.⁠

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు ధర్మతనయుం డగస్త్యు
మహాత్మ్యంబు విని వెండియుఁ దచ్చరిత్రంబు రోమశు నడిగిన నమ్ముని యి ట్లనియె.

⁠ 2


సీ.⁠

“కృతయుగంబునఁ గాలకేయగణంబుతో
                 వృత్రుఁ డన్నసుర గర్వించి యమర
పతిఁ దొట్టి వేల్పుల బాధించుచున్నఁ, ద
                 ద్భయమున నమరులు బ్రహ్మకడకుఁ
జని “పోరిలో వృత్రుఁ జంప నుపాయ మె
                 య్యది[2]యొ మా కాన తి”మ్మన నజుండు
దివిరి “సరస్వతీ తీరంబు నందు
                 నిశ్చింతుఁ డై తప మొప్పఁ జేయుచున్న

⁠


ఆ.⁠

యా దధీచి కడకు నరిగి వేఁడుండు; ని
జాస్థు లిచ్చు మీకు నమ్మహాత్ముఁ;
డవి జయించు వజ్ర మాదిగా నిఖిలది
వ్యాయుధంబు లై సురారివరుల.

⁠ 3


వ.⁠

అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు” ననిన నమరు లెల్లం గమలాస
నుశాసంబున దధీచిపాలికిం జని కృతప్రణాములై యి ట్లనిరి.

⁠ 4


క.⁠

[3]భువనజనస్తుత! నిజగౌ
రవ మెసఁగఁగ నమరపతి పురస్కృతు లగు ని
ద్దివిజుల కెల్ల హితంబుగ
భవదస్థిచయంబు లిమ్ము పరమమునీంద్రా!”

⁠ 5


వ.⁠

అనిన విని దధీచి సంతసిల్లి “కృతార్థుండ నైతి” నని దేవహితార్థంబుగా నిజప్రా
ణంబులు విడిచె; [4]నమరు లెల్ల నమ్మహామునియస్థు లాయుధంబులుగా బరి
గ్రహించి రందు.

⁠ 6
  1. ↑ మండిత ... రాజమహేంద్రా
  2. ↑ యానతిండు మా కనిన నజుఁడు ... తప మొగిఁ ... మాదిగా దివ్యాయు, ధంబు లై సురారితతులఁ బోర
  3. ↑ భువనస్తుత మై నీ గౌ, రవ మొప్పఁగ
  4. ↑ నమరు లెల్ల కమలాననునియోగంబున