పెదవులు చెక్కిళ్లు వీనికంపము, ముఖము వాడుట, ప్రక్కలను జూచుట, ముఖము నల్లనౌట, నల్లగ్రుడ్లు తిరుగుట, ఒక్కప్రక్కకు పోవుట, దండము పెట్టుట, పారిపోవుట, వ్రేళ్ల కవచమును కఱచుకొనుట, ఆంగికములచే వాచికములచే సహాయమును వెతకుట మొదలయినవి; నీకు నే దాసుఁడను నిన్ను శరణు పొందినాను నన్ను కాపాడుము కాపాడుము, అభయ మియ్యవలయును అనుట; ఇవి మొదలయిన అనుభావములును; అన్నిసాత్వికభావములును, త్రాసము, ఆవేగము, శ్రమము, మృతి, విషాదము, చాపలము, మోహము, చింతయు, జాడ్యము, అపస్మారము, ఈసంచారిభావములును గలవు.
బీభత్సరసలక్షణం
| విభావాద్యైస్సదస్యానాం ప్రాపితో రస్యతామసౌ. | 380 |
| జుగుప్సాస్థాయికస్తజ్ జ్ఞైర్బీభత్స ఇతి కథ్యతే, | 381 |
| అనుభావైః పరావృత్తి ముఖదృక్కూణనాదిభిః, | 382 |
| నిర్వేదశంకాపస్మారవిషాదజడతాదిభిః, | 383 |
| స పునర్ద్వివిధక్షోభీ చోద్వేగీతి చ కథ్యతే, | 384 |
విభావము మొదలైనభావములచే సభవారికి ఆస్వాద్యత్వమును బొందింపఁబడినదియు జుగుప్సాస్థాయియు నైనది బీభత్సరస మనఁబడును. ఈబీభత్సరసము రక్తము, మాంసము, పులినీరు, ఎముకలు మొదలయినవియు, వాంతి, జొల్లు మొదలయినవియు, ఆశ్రయముగాఁ గలది, వెనుకకు తిరుగుట. ముఖము దృష్టియు వంకబోవుట మొదలయినవి, నల్లనిముఖముకాంతి, ఈఅనుభావములతోను, పులకము మొదలయిన సాత్వికానుభవములతోను, నిర్వేదము; శంక, అపస్మారము, విషాదము, జాడ్యము, దైన్యము, మోహము, శోకము మొద