నిర్వేదలక్షణం
| తత్త్వజ్ఞానాచ్చ దౌర్గత్యాదాపదో విప్రయోగతః. | 147 |
| దుఃఖాదేరపి నైష్ఫల్యమతిర్నిర్వేద ఉచ్యతే, | |
తత్త్వజ్ఞానము, పేదఱికము, సంకటము, వియోగము, దుఃఖము మొదలైనవానిచేఁ గలుగు ఫలాభావము నిర్వేద మనఁబడును.
గ్లానిలక్షణం
| అధివ్యాధిజరాతృష్ణావ్యాయామసురతాదిభిః. | 148 |
| నిష్ప్రాణతా గ్లానిరత్ర క్షామాంగవచన క్రియాః, | 149 |
మనోవ్యాధి, రోగము, ముసలితనము, దప్పి, వ్యాయామము, సురతము, ఇవి మొదలైనవానిచే గలుగు దౌర్బల్యము గ్లాని యౌను. ఇందు దేహము చిక్కుట, సన్నపలుకులు, మెల్లనపనులు, కలావిషయములయందు ఉత్సాహములేకయుండుట, దేహవైవర్ణ్యము, గుడ్లు తిరుగుట మొదలైనవికారములు గలవు.
శంకాలక్షణం
| శంకా చౌర్యాపరాధాద్యైః స్వానిష్టోత్ప్రేక్షణం మతం, | 150 |
| అవకుంఠనవైవర్ణ్యకంఠసాదాదయో౽పిచ, | |
చౌర్యాపరాధాదులచేఁ దన కహితము నుత్ప్రేక్షించుట శంక యనఁబడును. ఇందు మాటిమాటికి పార్శ్వములను చూచుట, మోము వాడుట, ముసుకిడుట, వైవర్ణ్యము, కంఠగద్గదము, మొదలైనచేష్టలు గలవు.