| రక్తేవ రంజయేన్నిత్యం నిస్వానాశు వివాసయేత్, | 36 |
సంగీతాభినయాద్యనేకవిద్యాప్రాగల్భ్యధైర్యములు గలదిగాను, జనులయందు ధనాశచేతనే అనురాగము గలదిగాను నుండునది సామాన్య; ఇదే గణిక. ఈనాయికకు నాయకుఁడు గుణవంతుఁడైనను ధనాగమము లేకున్న వానియందు ప్రేమ గలుగదు. ధనాగమముగలవారు భగ్నకాములైనను, బాలురైనను, పాషండులైనను, షండులైనను, వారలయందు ప్రేమగలదానివలెనే వారిని సంతోషపఱుచును. ఈచెప్పఁబడినవారు కపటమెఱుగనివారుగాను నుండవలయును. ధనము లేనివానిని తఱుమకొట్టును. దానికి దౌత్యము మొదలైనగుణములు సహాయములని చెప్పఁబడుచున్నవి.
| ఏతాష్షోడనాయక్యో హ్యవస్థాభేదతః క్రమాత్, | 37 |
ఈపదునాఱునాయికలకును శృంగారావస్థాభేదములచే ఒక్కొకతెకు నెనిమిదివిధములుగ భేదములు చెప్పబడినవి.
అష్టవిధనాయికా నిరూప్యంతే
| స్వాధీనపతికా చైవ తథా వాసకసజ్జికా | 38 |
| కలహాంతరితా చైవ తథా ప్రోషితభర్తృకా, | 39 |
స్వాధీనపతిక, వాసకసజ్జిక, విరహోక్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తృక, అభిసారిక అని పూర్వము చెప్పఁబడిన నాయికలు ఒక్కొకతె దశాభేదముచేత నెనిమిదివిధములఁ జెప్పఁబడును.