పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105. క. సిద్ధులు జ్ఞానం బగునా
సిద్ధియు దృశ్యంబు లవియుఁ జేపట్టుదురా
శుద్ధములు గానిసిద్ధు ల
బద్ధంబులు శివముకుంద పరమానందా.

106. క. మహిమఁ గనలేరు లోకులు
మహిలో బోధం బపారమహిమ యదెగదా
మహిమవలె నందురజ్ఞులు
బహుళముగా శివముకుంద పరమానందా.

107. క. ఇహమందలి మంత్రౌషధ
విహితము లీవిధులలో వివేకములేకే
మహి మని చూతురు మూఢులు
బహుమతిగా శివముకుంద పరమానందా.

108. క. సుజ్ఞాన మహిమ యెప్పుడు
సుజ్ఞానియె యెఱుఁగనేర్చు సుస్థిరమతి యై
యజ్ఞాని తెలియనేర్చునె
ప్రాజ్ఞునిగతి శివముకుంద పరమానందా.

109. క. పరమానందయతీశ్వర
విరచిత మీశతక మిలను విఖ్యాతముగా
కరుణింపు త్రిజగధీశ్వర
పరమాత్మా శివముకుంద పరమానందా.

110. క. పరతత్త్వం బిది శతకము
పరమరహస్యంబు ముక్తిభాజన మిలలో
వరయోగివిలాసం బిది
పరమాత్మా శివముకుంద పరమానందా.

111. క. హరిహర గిరిధర పురహర
గరుడధ్వజ నీలకంఠ కనకాంబర శం
కర మాధవ గౌరీధవ
పరమాత్మా శివముకుంద పరమానందా.