పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62. క. కను వెలుఁగుననే చూచినఁ
గనవచ్చును జీఁకటైనఁ గానఁగ వశమా
గను గంటనె తనుఁ గనవలెఁ
బనివడి తా శివముకుంద పరమానందా.

63. క. లో వెలిఁ జూచిన నొకటే
లో వెలిఁ గాకుండఁ జూడ లోనగు నొకటే
లో వెలిఁ దానై కనుఁబో
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.

64. క. ఒకటే రెండై తోఁపఁగ
నొకటిని జెప్పంగ వలసె యొకటై యున్నన్‌
యొకటి నొక టేల సేయను
బ్రకటముగా శివముకుంద పరమానందా.

65. క. త న్నెఱుఁగనిదియు ఒకటే
త న్నెఱిఁగినయదియు నొకటె తా నన రెండై
యున్నది యొకటే సత్యము
పన్నుగ నిఁక శివముకుంద పరమానందా.

66. క. మఱచినయదియును నొకటే
మఱపున నెఱిఁగెడిది యొకటె మఱువని దొకటే
మఱ పెఱుక కాని దొకటే
పరమాత్మా శివముకుంద పరమానందా.

67. క. చూడఁగఁబడినది యొకటే
వేడుకఁ జూచెడిది యొకటె వీనికి వెలియై
చూడఁగవలసిన దొకటే
పాడి యిదే శివముకుంద పరమానందా.

68. క. కానఁగఁబడినది కాన్పును
మానుగఁ గనుఁగొన్నవాఁడు మఱివీనికి లోఁ
గానియతండును దానే
భానునుతా శివముకుంద పరమానందా.