పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. క. తను నే నెఱుఁగనిమునుపే
తనయాటలు చెల్లెఁగాక తా మా యనఁగా
నను నే నెఱిఁగిన పిమ్మట
పనిగలదా శివముకుంద పరమానందా.

28. క. అంతా నే నై యుండగ
నింతైనన్‌ మాయ కునికి యెక్కడి దయ్యా
యంతటఁ దొలఁగక నాతోఁ
బంతంబా శివముకుంద పరమానందా.

29. క. కట్టిడిమాయ యనంగా
రట్టుకు లోనాయెఁగాక భ్రమ యదికాదా
పట్టఁ బసలేని దది యే
పట్టున నిఁక శివముకుంద పరమానందా.

30. క. ఔరౌర మాయ కంటెను
యేరీతిని తనగుణంబు లెఱుఁగ రటం చా
నేరమి జీవులపై నిడి
పాఱెడి నిఁక శివముకుంద పరమానందా.

31. క. నలుదిశల నిక్కడక్కడఁ
దలచూపఁగ లేక మాయ దాగెను కంటే
యలపూర్ణుఁడ నేఁ గాఁగాఁ
బల ముడిగెను శివముకుంద పరమానందా.

32. క. కడుదబ్బఱలకు నెల్లను
నొడిగట్టిన మాయగుట్టు లొగి నేఁ గనఁగాఁ
బొడచూప వెఱచి తానే
వడిపోయెను శివముకుంద పరమానందా.

33. క. ఇది కల్లర ఛీయన్నా!
వదలక యీమాయ కదియవచ్చిన నేమో
ముదిలంజెవలపు చాలును
పదివే లిఁక శివముకుంద పరమానందా.