పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20. క. మాటల వినుకులఁ దగులదు
సూటిగ సద్గురుఁడు చూపఁ జూచినఁ గా కే
ర్పాటును గా దది కుజనులు
పాటింపరు శివముకుంద పరమానందా.

21. క. అతి చంచల మై తిరిగెడి
మతి మీదయవల్ల నిపుడు మట్టుకు వచ్చెన్‌
గతిచెడి ఱెక్కలు విఱిగిన
పతగమువలె శివముకుంద పరమానందా.

22. క. ఇలు వెడలి బయలుదేరక
గెలిచే దేలాగు మాయఁ గినియుచు రాఁగా
నిలు సొచ్చి తలుపు మూసిన
బలిమేదీ శివముకుంద పరమానందా.

23. క. బైలుగ మాయాభూతము
హేలాగతి నొప్పుఁ గాక యేలా తొలఁగున్‌
జాల వివేకపుఁ జబుకుల
పాలాడక శివముకుంద పరమానందా.

24. క. ఏయెడఁ బెద్దలసంగతి
సేయంగా నిత్యసుఖము చేకొనవచ్చున్‌
మాయాభూతము తొలఁగు ను
పాయం బిది శివముకుంద పరమానందా.

25. క. చాలం గర్మపుఁ దొట్లన్‌
సోలంగా నుంచి మాయ జోలలు వాడున్‌
లాలీయని జీవులనే
బాలురఁ గని శివముకుంద పరమానందా.

26. క. తానే పరదైవంబని
కానక తనకన్న వేఱు గాఁదలఁచేదే
యూనిన మాయారూపము
భానునుతా శివముకుంద పరమానందా.