పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. క. తనమహిమ తనకుఁ దెలిసిన
దనయందేతోఁచి యణఁగుఁ దత్త్వములెల్లన్‌
దనమహిమ తెలియఁ దనకే
పనుపడవలె శివముకుంద పరమానందా.

7. క. తనుఁ దాఁ దెలిసెడి మార్గం
బనువుగ సద్గురులవలన నతిసులభంబౌ
తనయుక్తుల శాస్త్రంబుల
బనిగొన దది శివముకుంద పరమానందా.

8. క. గురువాక్యము శాస్త్రార్థము
గురుతుగఁ దనయనుభవంబుఁ గుదురుగ నొకటై
మది నిల్చునేని యదిగా
పరమార్థము శివముకుంద పరమానందా.

9. క. మితిమేరలేని జన్మము
లతికష్టము లనుచు నెంచి యంతటఁ దత్త్వం
బతివిశదముగాఁ దెలియని
బ్రతు కేటికి శివముకుంద పరమానందా.

10. క. అలతత్త్వము గురుకృపచే
నలవడు నని నమ్మి మిగుల నాసక్తుం డై
తలపడవలె గురుభజనకుఁ
బలుమాఱును శివముకుంద పరమానందా.

11. క. అల సద్గురుకృప లేకయె
తలపడి చదివితి మటంచుఁ దటవటసుద్దుల్‌
పలుకుచు తిరిగినఁ దెలివికి
ఫలమౌనా శివముకుంద పరమానందా.

12. క. కంటెసఁగఁ గర్మజాలము
లుంటే బంధంబు దీఱదో గురుపదముల్‌
కంటే మోక్షము చేరువ
పంటగదా శివముకుంద పరమానందా.