పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు
శివముకుందశతకము


1. క. శ్రీవరగిరిజానాయక
గోవింద లలాటనేత్ర గోకులతిలకా
భావజసంహార హరిహర
భావాత్మక శివముకుంద పరమానందా.

2. క. దైవము లిద్దఱు నేకో
దేవాది శ్రుతులవల్ల, దెలియఁగ నొకటే
భావించెద మిము నేకీ
భావంబుగ శివముకుంద పరమానందా.

3. క. భక్తుల పరిపక్వములకు
వ్యక్తులు రెండౌటగాక వర్ణింపఁగ న
వ్యక్తం బని తెలియుట నిజ
భక్తికదా శివముకుంద పరమానందా.

4. క. పరమానందయతీంద్రుఁడ
సురుచిరముగ మిమ్ము వాక్ప్రసూనంబులచేఁ
గరమర్థిఁ బూజచేసెద
పరమాత్మా శివముకుంద పరమానందా.

5. క. ఒకటై రెండై మూఁడై
సకలంబై యేమిగాని సహజము బయలై
యకలంకమతికిఁ దోఁచును
ప్రకటముగా శివముకుంద పరమానందా.