పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

పరమానందయతీంద్రుఁడు రచించిన గ్రంథములలో శివముకుందశతకము సంపఁగిమన్నశతకము ప్రకృతము ముద్రితములై యున్నవి. శివముకుందశతకము కవితాశైలినిబట్టి చూడఁ బ్రథమప్రయత్నమేమో యని తోచును. వేదాంతాభ్యాసమునకుఁ బ్రథమమునఁ జెప్పవలసిన సగుణనిర్గుణరూపములు మాయ, ప్రకృతి లోనగునవి యిందును, ఉపాసనయోగములు గురుసేవ లోనగునవి సంపఁగిమన్నశతకమునందు నుంటవలన శివముకుందశతకము ప్రథమప్రయత్నమని తోచుచున్నది. శివముకుందశతకము మృదుమధురశైలిలోఁ బఠనీయముగ సుబోధముగ నున్నది.

“ఏకోదేవః” యని శ్రుతులు చెప్పుటవలన హరిహరరూప మగు బ్రహ్మస్వరూపమును నేకముగా భావించి యీకవి హరునకు ముకుందునకు నంకితముగ నీశతకము రచించెను. దీనివలన నీకవికాలము నిరూపింప నొకస్వల్ప మగునాథారము చిక్కును. ఇంకను బ్రబలాధారములు చిక్కువఱకు దీనిని కవికాలనిరూపణముపట్ల నుపయోగించుకొన ననువౌనేని పరిగ్రహింపనగును. ఈకవినిగూర్చి విశేషాంశములు సంపఁగిమన్నశతకపీఠికలోఁ గలవు.