పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96. ఆలుబిడ్డల విడిచిన నందువల్ల
మోక్ష మబ్బునె? తనుఁబట్టి ముంచుకొన్న
కల్మషము తీఱినప్పుడుగానఁ గలదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

97. విషయముల రోసి నరుఁడు నిర్విషయుఁడైనఁ
దనకు మోక్షంబు హస్తగతంబు కాదె?
విషయములకన్న మఱిచేటు వేఱ లేదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

98. వేడుకై యుండు ముందఱ విషయసుఖము;
వెనుక బరువౌను సంసారవిషయసుఖము;
కాదు సుఖ మిది మీసాలమీఁదితేనె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

99. చుట్టములుఁ దల్లిఁదండ్రులు సుతులు హితులుఁ
దాను పోయెడిగతులకుఁ దగిలి రారు,
వారు త్రోవంప వచ్చెడువారుగాని,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

100. మొదల సంసారబద్ధుఁడై మోసపోయి
వెనుక చింతించు దేహంబు విడుచువేళ;
నిట్టిజీవుండు దుదముట్ట నెట్లునేర్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

101. తన్నుఁ గట్టను మఱి త్రాళ్లు తానె తెచ్చి
కట్టుపడురీతి జనుఁడు సంకల్ప మనెడు
పాశజాలంబుతో వాలబద్ధుఁ డగును,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

102. చేయుక్రియ లెల్ల శివుఁడైన సేయవలయు,
తనకుఁ గర్తృత్వ మెన్నఁడుఁ దలఁపరాదు,
మనుజుఁ డపరోక్షమునఁ బొందు మార్గ మిదియ,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.