పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89. గుహలఁ జొచ్చుక కొందఱు కూడు నీళ్ళు
విడిచి త మ్మేమి కన్నారు వెఱ్ఱివారు?
మూల బెట్టిన దేహాల ముక్తి యెట్లు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

90. చే టెఱుంగని నలికూన జీవులెల్ల
విషయములఁ జిక్కుపడినట్టి విధము వినవె
పొంగి ఝషకము గాలము మ్రింగుకరణి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

91. దేహ మస్థిర మని యెంత తెలిసియుండు
మంచిగతి చూచుకోలేరు మాయఁదగిలి
జీవు లజ్ఞాన మే మని చెప్పవచ్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

92. చాలుచాలును సంసారసంగ మనుచు,
వేఁడివెసలంటి గొబ్బున విడిచినట్లు
విడిచి మనుజుండు సద్గురు వెదుకవలయు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

93. దేవదానవమానవ తిర్యగాఖ్య
జీవు లింతల భ్రమలచేఁ జిక్కినారు;
శక్తి బలవంత మీజగజ్జాలమునకు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

94. సుతుని నాలిని సంపదఁ జూచి చూచి
మోహియై నరుఁ డూరకే మోసపోవుఁ
దనకు నవి మీఁదఁజే టని తలఁచుకొనఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

95. ఆలుబిడ్డలు తన దని యాస సేయు;
నందు నేమియు మేలు లే దరసి చూడ;
వెంట వత్తురె తనువులు విడిచిపోతె
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.