పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82. సత్త్వ మిది యని తెలిసియె జనులతోడఁ
జెనకి పలుమాఱు వాదము సేయఁబోక
మౌనవృత్తిని జరియింప మంచితనము,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

83. ద్వైత మనుచును గొందఱద్వైత మనుచు
వాద మొనరింతు రెఱుఁగక; వారు భువిని
కలిమియై నట్టితత్త్వంబు గానలేరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

84. మానవులు వార లెంత నజ్ఞాను లైనఁ
గడఁపజాలరు ప్రారబ్ధకర్మఫలము;
లిందుకై కాదె తనువుల నెత్తవలసె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

85. *జనుఁడు దా నవివేకియై సాహసమునఁ
బట్టు దుర్దానములు మఱి పాపమనక;
వాని నన నేల! గతజన్మవాసన యది,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

86. ఒడలు సర్వేంద్రియంబుల కునికి గాదె?
యొడలు గలవానికిని గాదె యోగవిద్య?
యొడలు చెడినట్టివానికి యోగ మేల?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

87. బంధ మెచ్చటనుండి సంప్రాప్త మయ్యె?
ముక్తి యేవంకనుండియు మొలచివచ్చె?
బంధముక్తులు రెండును భ్రమలుసూవె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

88. ఇహపరాపేక్షలును రెండు నెంచిచూడ
నినుము బంగారు సంకెలలే తలంపఁ
గోర రిట్టివి మోక్షాధికారు లెపుడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • శాస్త్రవిదుఁడయ్యు మనుజుండు