పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76. మనసు వెగ టౌట యెఱిఁగిన జనము లెల్లఁ
బాఱవిడి చూరకుందురు పట్టులేక
వెఱ్ఱివాఁడైన సంకెళ్లువేయవలదె!
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

77. బ్రహ్మనిష్ఠాంగపరుఁ డైనపావనునకు
తీర్థయాత్రల భూమెల్లఁ దిరుగ నేల?
తాను గలచోట సకలతీర్థములు గలవు!
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

78. *మాంసమును చీము నెత్తురు మలిన మైన
తోలుఁ గొనిపోయి నీళ్ళలోఁ దొలిచినపుడె
శుద్ధిగాదది, మనఃపరిశుద్ధిగాని
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

79. మఱియు సర్వేంద్రియములకు మనసు రాజు;
మనసునకు రాజు తలఁపంగ మారుతంబు;
మనసు మారుతమొకటైన మలయు సుఖము,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

80. మనసు నిల్పంగ నిలుచును మారుతంబు;
చూపు నిలుపంగ నిలుచును స్థిరసుఖంబు;
స్థిరమనోదృష్టి నిల్పినఁ జేరు ముక్తి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

81. పాలు నీరును రుచియును బరఁగునట్టి
జీవుఁ డనుమాయ శివుఁడును జేరియుండు!
మొదలఁగడపట నిత్యుండు మూఁడువగల
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • కష్టమాంసంబు నెత్తురు గప్పుకొనిన, తోళ్ళు గొనిపోయి ముంతురు నీళ్ళలోన