పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69. అనుభవముఁ దెల్పనేరని యతని చేత
చారు సుజ్ఞానమును విన్నవారిప్రజ్ఞ
అంధకుడు చూపుతెరువున నరుగుకరణి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

70. విశ్వమున నూట వేయింట వెదకి చూడ
నొక్కశివయోగి దొరకుట యెక్కు వరయ
కల్లయోగుల కేమి పెక్కండ్రు గలరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

71. బ్రాహ్మణు లటంచుఁ గొందఱు పలుకు టెట్లు?
బ్రహ్మ నెఱుఁగంగనేరఁక బాఁపఁడగునె?
బ్రహ్మనెఱిఁగినవాఁడె పో బ్రాహ్మణుండు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

72. వేషధారులఁ జూచి వివేకు లైన
బ్రమయుచుందురు వేషంబుబలిమిఁ జూచి;
తెల్లముగ లోనిగుట్టెల్ల దేవుఁ డెఱుఁగు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

73. వేదశాస్త్రపురాణాది విద్యలెల్లఁ
జదివి పాండిత్యములు సేయుజనుల కెల్ల
ననుభవజ్ఞాన మెక్కడి దరసిచూడ?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

74. అనుభవజ్ఞానియైనట్టి యమలమూర్తి
తన్నుఁ బ్రకటన సేయఁడు ధాత్రిలోన
నివురు నుముకయు నిండిననిప్పురీతి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

75. తాను నిర్మలుఁడై యుండి తనకు లేని
యంటుఁ గల్పించుకొని తీర్థ మాడనేల?
మనము పోయెడిపోకలు మాన్ప వశమె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.