పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62. తన్నుఁ దాఁ దెల్సి జగమెల్లఁ దానయైన
మర్మ మెఱుఁగంగఁ జాల రీమందమతులు;
గడవఁజాలరు సంసారఘనపయోధి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

63. ఏమి భుజియింపఁ గోరిన, నెచట నున్న,
నెందుబోయినఁ, దన కెందు నేమికొదువ
పూర్ణభావంబు తనయందు బొడమియున్న?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

64. బుద్ధిజాడ్యులు తమలోనఁ బూర్ణమైన
నిండుబంగారమున వన్నె నిలిచినట్లు
కఠినమై యున్న బ్రహ్మంబు గానలేరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

65. చదువులేఁటికి? దేవతార్చనము లేల?
నిత్యనైమిత్తికాదుల నియమ మేల?
స్వానుభూతి రసామృతాస్వాదనులకు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

66. పూజలును మంత్రకథలును బుస్తకములు
యంత్రజాలంబు యోగంబు తంత్రములును
కడఁగి బ్రహ్మానుభవవిఘ్నకరము లరయ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

67. అనుభవము చాల కొకకొంద ఱవనిలోన
సిద్ధయోగుల మనుకొంద్రు సిగ్గులేక;
తేటతెలివిగఁ ద మ్మేమి తెలిసినారు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

68. స్మార్తకర్మంబుఁ గొందఱు సలుపలేక

  • బ్రహ్మవేత్తల మనుకొంద్రు బైసిమాలి;

అట్టిజనులకుఁ గైవల్య మెట్టు గలుగు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • పరమయోగుల