పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. ముక్కుబిగియించుకొని, గాలి మూటగట్టి
వట్టి పసలేనిపెనుబయల్‌ ప్రాఁక నేర్చి
యద్భుతానందమును బొందునతఁడె యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

35. లోకదృష్టియు మఱియు నాలోకదృష్టి
గానరా దిందు; నీరెండుఁ గాననట్టి
భావదృష్టిని గలవాఁడె భవ్యయోగి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

36. వెలుఁగుకవ్వల వెలిఁగెడు వెలుఁగుఁజేరి,
బయలుఁ గొనిపోయి యచ్చట బయలుఁగలిపి,
నిశ్చలత నున్నయతఁడెపో నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

37. ఒక్కటే లేదు మఱి వేయి లెక్క లేదు;
నొండు రెండును గాక దా నిండియుండు
నట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

38. చూడకే చూచు జగమెల్లఁ జోద్యమంది;
చావకే చచ్చు నత్యంతసరసలీల;
చేయకే చేయుఁ గ్రియలెల్ల సిద్ధయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

39. చూచువాఁడును, మఱి చూపు, చూడఁదగిన
వస్తువులు లేక, సమరసత్త్వమునఁ దలఁపు
నిలుపనేర్చినవాఁడె పో నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

40. కర్తయై యుండియును మఱి కర్త గాఁడు
భోక్తయై యుండియును మఱి భోక్త గాఁడు
అట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.