పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. చెనఁటి మానవు లణిమాదిసిద్ధులందు
మోహమొనరింతు; రదికాదు ముక్తిపథము;
పరమవిజ్ఞానపరు లిట్లు భ్రమలఁబడరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

28. పుట్టగోఁచులు పెట్టి, విభూతిఁ బూసి
జడలు ముడివెట్టి, కడసము చంకఁ బెట్టి,
గుహల గూర్చుండి, ప్రాణాలు కుదియఁబట్టి
తనువు పీడింపఁ దత్త్వంబుఁ గనుట యెట్లు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

29. కరకమండలమును బట్టి కావికోకఁ
బూనునంతనె ముక్తిని బొందుటెట్లు?
సమయవర్ణాశ్రమాదులు భ్రమలుకావె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

30. సప్తకోటిమహామంత్రజాలమెల్లఁ
జిత్తవిభ్రమ; మదిగాదు శివపదంబు;
నభ్యసింపఁడు దాని మోక్షాధికారి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

31. హెచ్చరిక గల్గి మానవుఁ డిహపరార్థ
ఫలము లాసింపకను బ్రహ్మపదముఁ గోరి
నిర్గుణాష్టాంగయోగంబె నెఱుఁగవలయుఁ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

32. సగుణచింతన, మణిమాదిసాధనంబు,
నిర్గుణోపాస్తి, కైవల్యమార్గ మిదియఁ
గాన, నిర్గుణయోగంబె పూనవలయు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

33. మంత్రలయహఠ మనియెడుమాయఁ విడిచి,
రాజయోగంబు సద్గురురాజువలనఁ
దెలియ నేర్చినవాఁడెపో దివ్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.