పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

పద్యభాగమునకుఁ గాళహస్తీశ్వరశతకము తార్కాణయై ధూర్జటికిఁగల భోగలాలసత్వము నిరూపించుచున్నది. ధూర్జటి యొడలు వధూస్తనాస్పోటనములచే గాయలు కాచినవఁట, కామినీసుఖముపై నింక రోఁత పుట్టలేదఁట, దేవకాంతలఁ గవసినను కామతాప మాఱదఁట, రతిద్వారసౌఖ్యములు చాలునఁట. ఈ ప్రసంగములను శతకస్థమగు రాజదూషణము సమన్వయించి పరిశీలించితి మేని విరక్తుఁడై వార్ధక్యమున నీశతకమును గవి రచించెనని తోఁచును. ఐహికములరోసి యీశతకము రచించి కవి కాళహస్తీశ్వరునిసన్నిధిలోఁ జేరెనని కొందఱు చెప్పుచున్నారు. కాళహస్తిమాహాత్మ్యములోఁ జెప్పబడిన తిన్ననికథ యిందు రెండు మూఁడుచోటులఁ బేర్కొనఁబడెను.

ఈశతకము మనోహరధారాశోభితమై మృదుపదగుంఫితమై ధూర్జటికవితామాధురీమహిమకుఁ దార్కాణముగ నున్నది. కవి శతకములో వ్యాకరణనియమములఁ బాటింపనిచోటులు పెక్కులుగలవు. ధూర్జటి పదునాఱవశతాబ్దమున శ్రీకృష్ణరాయల యాస్థానమున నుండెను.

నందిగామశేషాద్రిరమణకవులు
11-1- 25శతావధానులు