పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము వ్రాసినది శ్రీకృష్ణదేవరాయల యాస్థానమునందుఁ బేరెన్నికగన్న ధూర్జటి మహాకవి యని పరంపరగాఁ జెప్పుకొనుటేగాని శతకాద్యంతములలో నావిషయము నిరూపించుపద్యములు కానరావు. అంతమున నింకఁ గొన్నిపద్యములు లోపించినటు లుంటచేఁ గవిజీవిత మందుండునేమో యని భ్రాంతి కలుగుచున్నది.

ధూర్జటి యాఱువేలనియోగి బ్రాహణుఁడు భారద్వాజగోత్రుఁడు. ఇతఁడు చిరకాలము కృష్ణరాయల యాస్థానమునందుండి విద్యావినోదములలోఁ బాలుగొనుచున్నను కృతులనుమాత్రము నరాంకితము గావింపలేదు. తాను జెప్పికొన్న “నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీఁదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు” అనుప్రతిజ్ఞకు భిన్నముగా నడుచుకొనలేదు. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్గె నీయతులితమాధురీమహిమ" యని రాయలయంతవానిచేఁ గొనియాడఁబడిన యీకవిరాజన్యుని కవితాప్రశస్తిని ప్రత్యేకించి ప్రశంసింపఁబనిలేదు.

“హా తెలిసెన్ భువనైకమోహనోద్దత సుకుమారవారవనితా జనతాఘనతాపహారి సంతతమధురాధరామృతసుధారసధారలు క్రోలుటన్ జుమీ"