పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా భావించి వీక్షించు నా
పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా! 70

మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం
దరయం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్‌
మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్‌
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా! 71

మ. వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ
వరనామామృతపూర మానుచుఁ దగన్‌ వైరాగ్యభావంబునన్‌
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్‌ సంసారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెసన్‌ దైత్యారి నారాయణా! 72

శా. వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాస పరాశరుల్‌ వెదకిన న్వేఱొండు లేఁ డంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్‌
శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా! 73

మ. సుతదారాప్తజనాదివిత్తములపై శూన్యాభిలాషుండు నై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్‌
మృతిఁ బొందించి దమంబునన్‌ శమమునన్‌ మీఱంగ వర్తించు ని
ర్గతసంసారి భవత్కృపం బొరయు నో కంజాక్ష నారాయణా! 74