పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్‌ నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించు నన్‌ గడతేర్చు వేగమే
నీ సేవకునిఁ జేయు నిశ్చయముగఁ
గాపాడినను నీకుఁ గైంకర్యపరుఁడనై
చెలఁగి నీ పనులను జేయువాఁడ
తే. ననుచుఁ బలుమాఱు వేఁడెద నబ్జనాభ!
నాకుఁ బ్రత్యక్ష మగుము నిన్‌ నమ్మినాను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 99

సీ. శేషప్ప యను కవిచెప్పిన పద్యముల్‌
చెవుల కానందమై చెలఁగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు
భక్తితో విన్న సత్ఫలము గలుగుఁ
జెలఁగి యీ పద్యముల్‌ చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగాఁ బుస్తకంబెపుడుఁ బూజించిన
దురితజాలంబులు దొలఁగిపోవు
తే. నిద్ది పుణ్యాకరం బనియెపుడు జనులు
గష్టమెన్నక పఠియింపఁ గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 100