పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 96

సీ. కూర్మావతారమై కుధరంబు క్రిందను
గోర్కెతో నుండవా కొమరు మిగుల?
వరాహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య
కశిపునిఁ ద్రుంపవా కాంతి మీఱ?
వామనరూపమై వసుధలో బలిచక్ర
వర్తి నణంపవా వైర ముడిగి?
తే. యిట్టి పనులెల్లఁ జేయఁగా నెవరికేని
తగునె నరసింహ! నీ కిది దగును గాక!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 97

సీ. లక్ష్మీశ! నీ దివ్యలక్షణ గుణముల
వినఁజాల కెప్పుడు వెఱ్ఱినైతి
నావెఱ్ఱిగుణములు నయముగా ఖండించి
నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితరదైవముల నే
నమ్మలేదెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె
నీ పాదకమలముల్‌ నిరత మేను
తే. నమ్మియున్నాను నీ పాదనళినభక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవిద్య!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 98

సీ. అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు