పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడఁ
జెలిమిఁ జేసిన యట్లైనఁ జేటు వచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 94

సీ. దనుజసంహార! చక్రధర! నీకు దండంబు
లిందిరాధిప! నీకు వందనంబు
పతితపావన! నీకు బహునమస్కారముల్‌
నీరజాతదళాక్ష! నీకు శరణు
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు
మందరధర! నీకు మంగళంబు
కంబుకంధర! శార్ఙ్గకర! నీకు భద్రంబు
దీనరక్షక! నీకు దిగ్విజయము
తే. సకలవైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకల్యాణములు నగు నీకు నెపుడు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 95

సీ. మత్స్యావతారమై మడుఁగులోపలఁ జొచ్చి
సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మకిచ్చితి వీవు భళి! యనంగ
నా వేదముల నియ్య నాచారనిష్ఠల
ననుభవించుచు నుందు రవనిసురులు
సకలపాపంబులు సమసిపోవు నటంచు
మనుజులందఱు నీదు మహిమఁ దెలిసి
తే. యుందు రరవిందనయన! నీయునికిఁ దెలియు