పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తార్క్ష్యవాహన! నీవు దండిదాత వటంచుఁ
గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్థిమార్గమును నేననుసరించితినయ్య
లావైనఁ బదునాల్గులక్ష లైన
వేషముల్‌ వేసి నావిద్యాప్రగల్భతఁ
జూపసాగితి నీకు సుందరాంగ!
యానందమైన నేనడుగ వచ్చిన దెచ్చి
వాంఛఁ దీర్పుము నీలవర్ణ! వేగ
తే. నీకు నావిద్య హర్షంబుగాక యున్న
తేపతేపకు వేషముల్‌ దేను సుమ్మి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 86

సీ. అమరేంద్రవినుత! నేనతి దురాత్ముఁడ నంచుఁ
గలలోన నైనను గనులఁ బడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీ స్వరూపము చేసి నిలుపుకొందు
ధూప దీపము లిచ్చి తులసితోఁ బూజించి
నిత్యనైవేద్యముల్‌ నేమముగను
తే. నడుపుచును నిన్నుఁ గొలిచెదనమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలుగు నాకింతె చాలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 87

సీ. భువనేశ! గోవింద! రవికోటిసంకాశ!
పక్షివాహన! భక్తపారిజాత!