పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 83

సీ. పలుమాఱు దశ రూపములు ధరించితి వేల?
యేకరూపముఁ బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితి వేల?
రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రునిమీఁదఁ బవ్వళించితి వేల?
జలతారు పట్టెమంచములు లేరె?
ఱెక్కలు గల పక్షినెక్కసాగితి వేల?
గజతురంగాందోళికములు లేవె?
తే. వనజలోచన! యిటువంటివైభవములు
సొగసుగా నీకుఁ దోఁచెనో సుందరాంగ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 84

సీ. తిరుపతి స్థలమందుఁ దిన్నఁగా నే నున్న
వేంకటేశుఁడు మేఁతవేయలేఁడొ?
పురుషోత్తమమునకుఁ బోయినఁజాలు జ
గన్నాథుఁ డన్నంబుఁ గడపలేఁడొ?
శ్రీరంగమునకు నేఁ జేరఁబోయినఁ జాలు
స్వామి గ్రాసముఁ బెట్టి సాఁకలేఁడొ?
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ
గరివరదుఁడు పొట్టఁ గడపలేఁడొ?
తే. యెందుఁ బోవక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నామీఁద నెనరు లేదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 85