పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూర్ధమ్ము నీ పదమ్ముల మ్రొక్కఁగాఁ గోరుఁ
నాత్మ నీదై యుండు నరసి చూడ
తే. స్వప్నమున నైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 81

సీ. పద్మాక్ష! మమతచేఁ బరము నందెద మంచు
విఱ్ఱవీఁగుదుమయ్య వెఱ్ఱిపట్టి
మాస్వతంత్రంబైన మదము గండ్లకుఁ గప్పి
మొగము పట్టదు కామమోహమునను
బ్రహ్మదేవుండైనఁ బైడిదేహము గల్గఁ
జేసివేయక మమ్ముఁ జెఱిచె నతఁడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకల తోడి
ముఱికి చెత్తలు చేర్చి మూట కట్టె
తే. నీ శరీరాలు పడిపోవుటెఱుఁగ కేము
కాముకుల మైతిమిఁక మిమ్ముఁగానలేము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 82

సీ. గరుడవాహన! దివ్యకౌస్తుభాలంకార!
రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమమకుటాభరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీవిభూషిత!
సురవరార్చిత! చంద్రసూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత!
రాక్షసాంతక! నాగరాజశయన!