పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మించి సజ్జనుల వంచించకుండినఁ జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్‌ దీయకుండినఁ జాలు
గనకకంబపు గుళ్లుగట్టినట్లు
తే. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ
బేరుకీర్తిగ సత్రముల్‌ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 79

సీ. ఇహలోకసౌఖ్యము లిచ్చగించెద మన్న
దేహ మెప్పటికిఁ దా స్థిరత నొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ దుర్విలోన
బాల్య యువత్వ దుర్బల వార్ధకము లను
మూఁటిలో మునిఁగెడి ముఱికికొంప
భ్రాంతితో దీనిఁ గాపాడుద మనుకొన్నఁ
గాల మృత్యువు చేతఁ గోలుపోవు
తే. నమ్మరాదయ్య! యిది మాయనాటకంబు
జన్మమిఁక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 80

సీ. వదనంబు నీనామభజన గోరుచునుండు
జిహ్వ నీ కీర్తనల్‌ సేయఁ గోరు
హస్తయుగ్మంబు నిన్నర్చింపఁ గోరును
గర్ణముల్‌ నీ మీఁద కథలు గోరుఁ
దనువు నీ సేవయే ఘనముగాఁ గోరును
నయనముల్‌ నీ దర్శనంబుఁ గోరు