పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. వసుధాస్థలంబున వర్ణహీనుఁడు గాని
బహుళ దురాచారపరుఁడు గాని
తడసి కాసియ్యని ధర్మశూన్యుఁడు గాని
చదువనేరని మూఢజనుఁడు గాని
సకలమానవులు మెచ్చని కృతఘ్నుఁడు గాని
చూడ సొంపును లేని శుంఠ గాని
అప్రతిష్ఠలకు లోనైన దీనుఁడు గాని
మొదటికే మెఱుఁగని మోటుగాని
తే. ప్రతిదినము నీదు భజనచేఁ బరఁగునట్టి
వానికే వంక లేదయ్య వచ్చు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 75

సీ. ఇభకుంభములమీఁది కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱచైన మూషికమును?
నవచూతపత్రముల్‌ నమలుచున్న పికంబు
గొఱుకునే జిల్లేడుకొనలు నోట?
అరవిందమకరంద మనుభవించెడి తేఁటి
పోవునే పల్లేరుపూల కడకు?
లలితమైన రసాలఫలముఁ గోరెడి చిల్క
మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ?
తే. నిలను నీకీర్తనలు పాడనేర్చినతఁడు
పరులకీర్తనఁ బాడునే యరసి చూడ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 76

సీ. సర్వేశ! నీపాదసరసిజ ద్వయమందుఁ
జిత్త ముంపఁగలేను జెదరకుండ