పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీవేళ నీ కడ్డమెవరు వచ్చినఁ గాని
వారికైనను లొంగి వడఁకఁబోను
తే. గోపగాఁడను నీవు నా గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 70

సీ. ప్రహ్లాదుఁ డేపాటి పైఁడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె నగలు రత్నంబు? ల
హల్య నీకే యగ్రహారమిచ్చె?
ఉడుత నీ కేపాటి యూడిగంబులు చేసె?
ఘనవిభీషణుఁ డేమి కట్నమిచ్చె?
పంచపాండవు లేమి లంచ మిచ్చిరి నీకు?
ద్రౌపతి నీ కెంత ద్రవ్యమిచ్చె?
తే. నీకు వీరంద ఱయినట్లు నేను గాన?
యెందుకని నన్ను రక్షింప విందువదన?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 71

సీ. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర జేరి
భిక్షమెత్తితి వేల, బిడియపడక?
యడవిలో శబరి దియ్యని ఫలా లందియ్యఁ
జేతులొగ్గితి వేల, సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ విదురునింటికి నేఁగి
విందుఁగొంటి వదేమి, వెలితిపడక?
నటుకు లల్పము కుచేలుఁడు గడించుక తేర
బొక్కసాగితి వేల, లెక్కగొనక?