పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గగనమం దున్న చుక్కల నెంచఁగావచ్చు
జీవరాశుల పేళ్లు చెప్పవచ్చు
నష్టాంగయోగము లభ్యసింపఁగవచ్చు
మేఁక రీతిగ నాకు మెసవవచ్చు
తే. తామరస గర్భ! హర పురందరులకైన
నిన్ను వర్ణింపఁ దరమౌనె నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 68

సీ. నరసింహ! నీవంటిదొరను సంపాదించి
సుమతి మానవుల నేఁ గొల్వఁజాల
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను
బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనము గాదిది నీకు కరవునఁ బోషింపఁ
గష్ట మెంతటి స్వల్పకార్యమయ్య?
పెట్టఁ జాలక యేల భిక్షమెత్తించెదవు
నన్ను బీదను జేసినా వదేమి?
తే. అమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగఁ
గన్నులకుఁ బండువై నీకుఁ గానఁబడునె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 69

సీ. వనజాతనాభ! నీవంకఁ జేరితి నేను
గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగ వరము లియ్యకకాని
లేవఁబోయిన నిన్ను లేవనియ్యఁ
గూర్చుండఁబెట్టి నీకొంగు గట్టిగఁ బట్టి
పుచ్చుకొందును జూడు భోగిశయన!