పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. బొందిలో నుండు ప్రాణముల్‌ పోయినంతఁ
గాటికే గాని కొఱగాదు గవ్వకైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 50

సీ. పలురోగములకు నీపాదతీర్థమె కాని
వలపు మందులు నాకు వలదు వలదు
చెలిమిసేయుచు నీకు సేవఁ జేసెదఁ గాన
నీ దాసకోటిలో నిలుపవయ్య
గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదఁ గాని
ఘోరరక్షలు గట్టఁగోరనయ్య
పాముకాటుకు నిన్నుఁభజనఁ జేసెదఁ గాని
దాని మంత్రము నేను తలఁపనయ్య
తే. దొరికితివి నాకు దండి వైద్యుఁడవు నీవు
వేయికష్టాలు వచ్చిన వెఱవనయ్య
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 51

సీ. కూటికోసము నేఁ గొఱగాని జనులచేఁ
బలు గద్దరింపులు పడఁగ వలసె
దార సుత భ్రమ దగిలి యుండఁగఁ గదా
దేశ దేశము లెల్లఁ దిరుగవలసెఁ?
బెను దరిద్రత పైని బెనఁగి యుండఁగఁ గదా
చేరి నీచుల సేవ చేయవలసె?
నభిమానములు మదినంటి యుండఁగఁ గదా
పరులఁ జూచిన భీతి పడఁగవలసె?
తే. నిటుల సంసారవారధి నీఁదలేక
వేయి విధముల నిన్ను నే వేఁడుకొంటి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 52