పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు
నాకు వంకలఁ బెట్టఁబోకు సుమ్మి
నాఁటికి శిక్షలు నన్ను చేయుటకంటె
నేఁడు సేయుము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దనరెంత పెద్దలైనఁ
తే. దండ్రివై నీవు పరపీడ దగులఁజేయ
వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 42

సీ. ధరణిలోపల నేను తల్లి గర్భమునందుఁ
బుట్టినప్పటినుండి పుణ్య మెఱుఁగ
నేకాదశీ వ్రతంబెన్నఁ డుండఁగ లేదు
తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్థికమైన పనులు చేయఁగలేదు
భిక్ష మొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కఁగ లేదు
ఇతర దానములైన నియ్యలేదు
తే. నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 43

సీ. అడవిపక్షుల కెవ్వఁడాహార మిచ్చెను
మృగజాతి కెవ్వఁడు మేఁతఁబెట్టె