పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. ఎచట నన్నుంచిననుగాని యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీ నామస్మరణనొసఁగు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 39

సీ. దేహ మున్నవఱకు మోహసాగరమందు
మునుఁగుచుందురు శుద్ధమూఢజనులు
సలలితైశ్వర్యముల్‌ శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మానఁజాల రెవరు
సర్వకాలము మాయసంసార బద్ధులై
గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి
నిందఁ జేయక తాము నిలువలేరు
తే. మత్తులైనట్టి దుర్జాతిమనుజులెల్ల
నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 40

సీ. ఇలలోన నే జన్మమెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య పాతకములు
తెలిసి చేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి
బాధ నొందితినయ్య పద్మనాభ!
అనుభవించెడు నప్పుడతి ప్రయాసంబంచుఁ
బ్రజలు చెప్పఁగఁ జాల భయము గలిగె
నెగిరి పోవుటకునై యే యుపాయంబైనఁ
జేసి చూతమఁటన్నఁ జేతఁగాదు
తే. సూర్యశశినేత్ర! నీ చాటుఁజొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 41