పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. అతివిద్యనేర్చుట యన్నవస్త్రములకే
పసుల నార్జించుట పాలకొఱకె
సతిని బెండ్లాడుట సంసారసుఖముకే
సుతులఁ బోషించుట గతులకొఱకె
సైన్యముల్‌ గూర్చుట శత్రుభయమునకే
సాము నేర్చుటలెల్ల చావుకొఱకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే
ఘనముగాఁ జదువుట కడుపుకొఱకె
తే. యితర కామంబుఁ గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తికొఱకె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 31

సీ. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వఁగబోదు
ధన మెప్పటికి శాశ్వతంబు గాదు
దారసుతాదులు తనవెంట రాలేరు
భృత్యులు మృతినిఁ దప్పించలేరు
బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు
బలపరాక్రమ మేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యం బెంతఁ గల్గిన
గోచిమాత్రంబైనఁ గొనుచుఁబోఁడు
తే. వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజనఁ జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 32

సీ. నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటి లేదు చూఁడ జనిన