పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. జిత్త మన్యస్థలంబునఁ జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 28

సీ. కర్ణయుగ్మమున నీకథలు సోఁకినఁజాలు
పెద్ద పోగుల జోళ్లుపెట్టినట్లు
చేతు లెత్తుచుఁ బూజసేయఁగల్గినఁజాలు
తోరంపు కడియాలు దొడిగినట్లు
మొనసి మస్తకముతోమ్రొక్కఁ గల్గినఁ జాలు
చెలువమైన తురాయిచెక్కినట్లు
గళము నొవ్వఁగ నిన్నుఁబలుకఁ గల్గినఁ జాలు
వింతగాఁ గంఠీలువేసినట్లు
తే. పూని నిన్నుఁ గొల్చుటే సర్వభూషణంబు
లితర భూషణముల నిచ్చగింపనేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 29

సీ. భువనరక్షక! నిన్నుఁబొగడనేరని నోరు
ప్రజకు గోచరమైన పాడుబొంద
సురవరార్చిత! నిన్నుఁజూడఁగోరని కనుల్‌
జలము లోపల నెల్లిసరపుగుండ్లు
శ్రీరమాధిప! నీకుసేవఁజేయని మేను
కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీ కథల్‌వినని కర్ణములైనఁ
గఠినశిలాదులఁగలుగు తొలలు
తే. పద్మలోచన! నీ మీఁద భక్తిలేని
మానవుఁడు రెండుపాదాల మహిషమయ్య
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 30