పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్టమానవులు వర్ధిష్ణులైరి
తే. పక్షివాహన! మావంటిభిక్షుకులకు
శక్తిలేదాయె నిఁక నీవెచాటు మాకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 26

సీ. భుజబలంబునఁ బెద్దపులులఁ జంపఁగవచ్చు
పాము కంఠముఁ చేతఁబట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్ల బాఱఁద్రోలఁగవచ్చు
మనుజుల రోగముల్‌ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేఁదు మ్రింగఁగవచ్చు
పదును ఖడ్గముచేత నదుమవచ్చుఁ
గష్టమొందుచు ముండ్లకంపలోఁ జొరవచ్చుఁ
దిట్టుఁబోతుల నోళ్లు కట్టవచ్చుఁ
తే. బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి
సజ్జనులఁ జేయలేఁడెంత చతురుఁడైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 27

సీ. అవనిలోఁ గల యాత్రలన్ని చేయఁగవచ్చు
ముఖ్యుఁడై నదులందు మునుఁగవచ్చు
ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్వఁగవచ్చు
దిన్నఁగా జపమాలఁ ద్రిప్పవచ్చుఁ
వేదాల కర్థంబువిఱిచి చెప్పఁగవచ్చు
శ్రేష్ఠ క్రతువులెల్లఁ జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమియ్యఁగవచ్చు
నైష్ఠికాచారముల్‌ నడుపవచ్చు