పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిఁగాని
చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁ గాని
శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేరఁ
తే. బంకజాతాక్ష! నే నతిపాతకుఁడను
దప్పులన్నియు క్షమియింపఁ దండ్రి వీవె!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

సీ. ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు
మాయ సంసారంబు మఱగి నరుఁడు
సకల పాపములైన సంగ్రహించును గాని
నిన్నుఁ జేరెడి యుక్తినేర్వలేఁడు
తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱు వచ్చి
గుంజుక చనివారు గ్రుద్దుచుండ
హింస కోర్వఁగలేక యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గుదిశలు చూడఁ
తే. దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడేడి
ముందు నీ దాసుఁడైయున్న ముక్తి గలుగు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

సీ. అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతులమాట జనవిరోధంబాయె
వదరుఁబోతులమాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్‌ దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి