పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. కమలనాభ నీ మహిమలు గానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 17

సీ. నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి
నీ భక్త వరులంత నిజమైన బాంధవుల్‌
నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు నిత్యజపము
తే. తోయజాతాక్ష! నీ పాదతులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 18

సీ. బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని
మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి
ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్‌ గప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ
బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
తే. నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన
తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 19