పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక


ధర్మపురి రామాయణము నరసింహశతకము రచించిన శేషప్ప యను శేషాచలదాసుఁడే యీశతకమును రచించెను. కవి తనకులము నీమూఁడు పొత్తములలోఁగూఁడఁ జెప్పుకోనలేదు. శైలిని బట్టి వందికులమువాఁడని శతకకవిచరిత్రకారులు అనుమానించిరి. కులమున కొకశైలియుండునా? ప్రమాణశూన్యమగు ననుమాన మెపుడును చరిత్రమునకు శరణ్యము కాజాలదు. కవి నివాసము ధర్మపురి. ఇది నిజామురాష్ట్రమునందు ఓరుగల్లునకుఁ బండ్రెండామడల దూరమునున్న సుప్రసిద్ధమగు నృసింహక్షేత్రము. ఇటఁ గలనృసింహస్వామిని గూర్చియే యీకవి నరసింహశతకము, నృకేసరిశతకము రచించెను. చిత్రభారతము, పద్మపురాణము, నవీనవసిష్టరామాయణము లోనగు గ్రంథములలో ధర్మపురి ప్రశంస గలదు. ఆంధ్రులందఱకుఁ దీర్థరాజముగా నున్న నిజామురాష్ట్రములోని క్షేత్రములు పెక్కులు యవన పరిపాలనమునకు లోఁబడినపిదప నితరరాష్ట్రవాసుల కగమ్యము లయ్యెను. క్రమముగ విస్మృతికి వచ్చెను. అట్టివానిలో సుప్రసిద్ధమగు ధర్మపురి క్షేత్రముగూడ నొకటి. ఈ నృకేసరిశతకము వ్రాఁతప్రతియొకటి నిజామురాష్ట్రమునందలి మెదకు మండలములోఁ బరిశోధనము గావించుతఱి జోగి