పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీప్యన్మునీంద్రాళిచే
నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా! 28

మ. సర్వంబున్‌ వసియించు నీతనువునన్‌ సర్వంబునం దుండగా
సర్వాత్మా! వసియించు దీవని మదిన్‌ సార్థంబుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్‌ గీర్తింతు రేప్రొద్దు నా
శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా! 29

మ. గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావలిన్‌
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్‌ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై
నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా! 30

మ. ఎల రారన్‌ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
బొలుపారం దగిలుండునేని యఘముల్‌ పొందంగ నె ట్లోపెడున్‌
కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్‌
నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా! 31

మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్‌
వెలయన్‌ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబునన్‌
జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్‌
దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠనన్‌ దోషఘ్న, నారాయణా! 32