పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భానుజవర్ధన భక్తజనార్ధన
భవలోకపరిహార మంగళంబు
కమలామనఃఖేల కాంచనమయచేల
మహనీయకులశీల మంగళంబు
గీ. మన్మధాకార రఘువీర మంగళంబు
మాధవానంద గోవింద మంగళంబు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

108. సీ. ఈపద్యశత మెవ్వ రింపుతోడఁ బఠించి
యావార్యుకరుణచే నమలమైన
స్వానుభూతివహించి సరవిఁ జెన్నొందుదు
రట్టివారలు భువి నహరహంబు
వాక్కుచే వర్ణింప వశము గానిదియును
నాత్మలోఁ దలఁపరానట్టిదియును
దేశకాలాదులం దిమడనట్టిదియును
నంతటఁ దానయై యలరునదియు
గీ. నగుచుఁ దన కన్యమును లేక యలవిగాక
నిట్టిదట్టిది యని నిర్ణయింపరాని
బట్టబయలైనబ్రహ్మంబుఁ బడయగలరు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.