పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90. సీ. సార్వకాలము చలించక నొక్కతీరుగాఁ
బరిపూర్ణమై యున్నబట్టబయలు
పతిగాదు సతిగాదు రతిగాదు బ్రతిగాదు
స్తుతియుఁ గా దుత్పత్తిస్థితియుఁ గాదు
మృతిగాదు స్మృతిగాదు శ్రుతిగాదు ధృతిగాదు
కృతిగాదు వికృతిగాదు హంకృతియుఁగాదు
క్షితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు
యతిగాదు మూలప్రకృతియుఁగాదు
గీ. గతియు దుర్గతియును లసద్గతియుగాదు
గతము విగతము గాదు నాగతముగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

91. సీ. నేత్రజిహ్వాఘ్రాణ శ్రోత్రత్వగింద్రియం
బుల కెవలాత్మను దెలియరాదు
పీతవర్ణముగాదు శ్వేతవర్ణముగాదు
కృష్ణపీతసునీలములునుగాదు
కటులవణాంలతిక్తకషాయ మధురాది
రస రుచి వస్తువర్గములుగావు
వీణారవముగాదు వేణునాదము గాదు
తాళమృదంగాది ధ్వనులుగావు
గీ. విమల పరిమళ మిళితద్రవ్యములు గాదు
గఠినశీతోష్ణమృదుసదాగతులుగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.