పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: అంటి అంటనిలక్షణము :-
82. సీ. జలజపత్రమునందు సలిల మంతనియట్లు
నద్దమందున రూప మంతనట్లు
బురద యాకుమ్మరపురుగు కంతనియట్లు
నాజ్యంబు జిహ్వయం దంటనట్లు
భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు
బలుచల్లలో వెన్న గలయనట్లు
చిత్రభానుండును చీఁక టంటనియట్లు
నాకాశమున వాయు వంటనట్లు
గీ. బ్రహ్మవేత్తలు మాయాప్రపంచమునందు
నఖిలవ్యవహారములు జేసి యంత రధిప
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: పరిపూర్ణబోధ :-
83. సీ. ఈయుత్తబట్టబయలేమి లే దనుచును
ద్వాదశాక్షరి చాల దలఁచలేను
మూలమింతయు లేక మేలుగా నెఱిఁగెడి
నీశరీరద్వయ మేమిలేదు
అని గురువాక్యము విని సతతము మది
నుంచంగవలె నిది కొంచ మనఁగ
నిది నిశ్చయముజేసి యిది విడిపించిన
పరిపూర్ణమైయుండు బాధలెక
గీ. రాకపోకలు రెండును లేకనుండు
నట్టిసూత్రంబు దెలిసిన నచలమగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.