పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80. సీ. అలచతుర్వేదమహాకావ్యములయందు
నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
ఉపనిషద్భాష్యంబు లూహించి వెదకిన
నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
యోగశాస్త్రములలో యుక్తిసాధించిన
నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
మంత్రశాస్త్రంబులు మర్మము ల్దెలిసిన
నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు
గీ. వేదవేదాంతసిద్ధాంతవేద్యులెల్ల
నిశ్చయింతురు నిత్యంబు నిగమవినుత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

81. సీ. వరబ్రహ్మక్షత్రియవైశ్యాదివర్ణము
ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
నలబ్రహ్మచర్యాదియాశ్రమధర్మము
ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
స్వగతివిజాతిస్వజాతిభేదంబులు
ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
కులరూపనామము ల్గోత్రసూత్రంబులు
ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ
గీ. ఖేదమోదంబులును భేదవాదములును
ల్నీకు నెన్నఁడు లేవుగా నిశ్చయముగ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.