పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ఎఱుకనిర్ణయము :-
68. సీ. ఇదిఘటం బిదిపటం బిది మఠం బిదిశఠం
బిదిహఠం బిదిపటం బిది యటంచు
నిదిమనం బిదిజనం బిదిధనం బిదిఘనం
బిదిదినం బిదివనం బిది యటంచు
నిదిహయం బిదిప్రియం బిదిప్రయం బిదినయం
బిదిజయం, బిదిభయం, బిది యటంచు
నిదిశిరం బిదికరం బిదినరం బిదిమదం
బిదిపరం బిదిస్థిరం బిది యటంచు
గీ. నదియు నిదియును నేదియు నది యటంచు
నెఱుఁగుచుండిన యెఱుకలో నెఱుక నీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

69. సీ. ఇది యపశబ్దంబు నిది సుశబ్దం బని
యెఱిఁగిన యెఱుకలో నెఱుక వీవు
ఇది యుష్ణ మిదిశీత మిది మృదుత్వం బని
యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
ఇదిశుక్ల మిదిరక్త మిదియుఁ గృష్ణం బని
యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
ఇది మధురం బామ్ల మిది లవణంబని
యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు
గీ. ఇది సుగంధంబు దుర్గంధ మిది యటంచు
నెఱుగుచుండిన యెఱుకలో నెఱుక వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.